Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఆయన మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయాల్లో తన మార్కు చూపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే త్వరలోనే తెలంగాణలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతోంది. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 50 డివిజన్లకు పార్టీ కమిటీలను నియమించింది. ఈ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదించారు. జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వరంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. గత కొన్ని వారాలుగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. కమిటీల ఎంపిక కార్యకర్తల అభీష్టం ప్రకారమే జరగాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు.

అయితే ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 50 డివిజన్లకు కమిటీలు నియమించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నేతల ఒత్తిడి మేరకే ఈ కమిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? లేక ఆయనే ఈ కమిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారా ? అన్నది ఆసక్తి రేపుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో సెటిలర్ల ప్రభావం ఉంటుంది. వాటిపై ఫోకస్ చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే జనసేన అధినేత ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఈ మేరకు కసరత్తు మొదలుపెడితే బాగుంటుందని పార్టీ నేతలు సూచించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన… తెలంగాణలోనూ అదే రకమైన విధానంతో ముందుకు సాగే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని కొన్ని సీట్లలో పోటీ చేసి.. మిగతా స్థానాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచన కూడా జనసేనకు ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా జనసేన బరిలోకి దిగొచ్చని.. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

గతంలో తెలంగాణలోని టీఆర్ఎస్‌తో పవన్ కళ్యాణ్ సత్సంబంధాలు కొనసాగించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తమకు మద్దతు ఇస్తుందని జనసేన భావించింది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఏపీ ఎన్నికల్లో జగన్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌, టీఆర్ఎస్ మధ్య సంబంధాల్లో గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా నిలిస్తే.. ఆయన టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగినట్టే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని  పవన్ కళ్యాణ్  భావిస్తున్నారని సమాచారం.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *