Spread the love

నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని…!

అచ్చమైన భాష..స్వచ్ఛమైన భాష..
యాబదారు అక్షరాల..తేనెలొలుకు  భాష ..తేటతెనుగు భాష నా… తెలుగుభాష…
అచ్చులతో గుణింతాలు..హల్లులతో ఒత్తులు అందమైన ఛందస్సు… సరసమైన సంధులు గల
వెన్నలాంటి భాష నా…తెలుగుభాష…!
భక్తిభావమైన విభక్తులు… సాటిలేని సమాసాలు
అందమైన అలంకారాలు… ప్రకృతీవికృతుల
పరిమళించు భాష నా… తెలుగుభాష…
అసమాన ఉపమానాలు.. బాషాకీర్తి పెంచు భాషాభాగాలు
వ్యాకరణాలతో కూడిన నుడికారాలు గలభాష
మధురమైన భాష నా మాతృభాష..!
తెలుగుబాషలోని తేటతెల్లపదము
వ్యాకరణముతోటి వాసికెక్కి
పద్యసంపదున్న పదునైన బాషరా
తేనెపలకుల భాష నా.. తెలుగుభాష
మరువకండి మీరు మాతృభాషనెపుడు
భావివార్కితెలుపు భాద్యతెరిగి
మధురమైనభాష మన తల్లిభాష
తేటతెనుగుభాష నా… తెలుగుభాష
జనని సంస్కృతంబు సకల భాషలకును దేశభాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స అంటే లెస్ అని అనుకుంటునారు మన జనాలు. లెస్స అంటే గొప్పది అని తెలుసుకునే వారు లేక పోయారు.. ప్రభుత్వ పాలకులదీ అదే తీరు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్బంధ తెలుగు ప్రవేశ పెటడములో ప్రభుత్వాలు అలసత వహిస్తున్నాయి. ప్రజలూ ఆలాగే ఉన్నారు.

ఎవరికైనా వారి వారి మాతృభాష అంటే అంత ప్రేమ ఉంటుంది.. కానీ మన తెలుగు వారికన్నా మిగతా భాషీయులకు వారి మాతృభాష అంటే ఇంకాస్త ప్రేమ ఎక్కువ. మనం మన తోటి తెలుగు వారితో ఆంగ్ల సంభాషణ చేయడం గొప్ప అనుకుంటాము.. అదే ఏ మలయాళీ నో , కన్నడిగుడో , అమితంగా తమిళీయులనో చూడండి. వారి తమిళ్ వారిని చూస్తే టక్కున వారి భాషలో సంభాషించడం మొదలు పెడతారు. మరి మనవారో, మన పక్కింటి పుల్లారావును చాలాకాలం తరువాత కలిస్తే కూడా మనం మాటాడేది.. ఆంగ్లములో పలకరింపే. ఈ జాడ్యం 1990 ల తరువాత మరీ మితిమీరిపోయింది.

ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాటాడితే శిక్షించే ప్రబుద్ధులు అధ్యాపకులు అయ్యారు. ఆంగ్లములో మాటాడితే నాగరీకమా? మరి మన మాతృభాషలో సంభాషిస్తే అది అనాగరీకమా? వేమన , సుమతి పద్యాలు నేర్చుకోవడం పాత పద్దతులు అయ్యాయి.

తెలుగు భాష శబ్ద సంపదలో, శబ్ద సౌష్టవంలో, భావ వ్యక్తీకరణలో, శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటి రావు. వీనుల విందుగా ఉన్న మన ఆనాటి తెలుగు గీతాలు , మన పూర్వీకులు రచించిన పదాలు , కీర్తనలు వినండి . తెలుగు భాషలోని మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. జన్మతః తమిళుడైన మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారో తెలుసా? సుందరమైన తెలుగు పాట పాడుతూ సింధూ నదిలో పడవ నడుపుదాం అంటూ.. అద్భుత గీతాన్ని వ్రాస్తూ సుందర తెనుంగు అని మెచ్చుకున్నారు.

మన విశ్వనాథులవారి మాటల్లో చెప్పాలి అంటే “ఒక్క సంగీతమేదో పాడునట్లు, మాట్లాడునప్పుడు విన్పించు భాష తెలుగు భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చేత, భాషయన యిద్దియని అనిపించుకున్న భాష”. కేరళ మహారాజు స్వాతి తిరునాళ్ తెలుగు భాషా సౌందర్యం తెలిసినవాడు కావున తనకు తెలుగు నేర్పించేందుకు ఆంద్ర దేశం నుండి ఏకంగా ఒక తెలుగు పండితున్నే తెప్పించుకుని ఈ భాషను నేర్చుకున్నారు.

ఇంక ఏకంగా త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలకు ఆద్యురాలు “విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ ” గారు జన్మతః కన్నడ దేశము , పెరిగింది తమిళ దేశములో అయినా నాకు అత్యంత ప్రియమైనది తెలుగే అని గర్వంగా చెప్పుకున్నారు. ఎందఱో మహా మహులు కీర్తించిన తెలుగు నేడు మన వారికే కాక పోతున్నది. తెలుగు పతాకం యెరుగని దేశమే లేదు, తెలుగు దివ్వె వెలుగునట్టి దిశయే లేదు” అని తెలంగాణా దార్శనికుడు శ్రీ దాశరథి రంగాచార్య గారు వెలుగెత్తి చాటారు.

తెలుగు నేల మీద పుట్టి , తెలుగు నేల మీద పెరిగి తెలుగు మాటాడ్డం రాదనీ చెప్పుకునే కుసంస్కారులను మన కాళోజీ ” తెలుగు బిడ్డవయుండి, తెలుగు రాదంచు, సిగ్గులేకా ఇంక చెప్పడమెందుకురా?, అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు, సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అని తీవ్రంగా మందలించారు. అయినా తెలుగు భాష తీయదనాన్ని నేర్చుకుని ఆస్వాదించే ప్రజలు కరువైపోతున్నారు.

సాక్షాత్ జాతిపిత మహాత్మా గాంధి తెలుగు నేర్చుకోవాలని తెలుగు వారి గూర్చి ఏమన్నారో తెలుసా ? తెలుగు భాష మధురమైనది. ఆ భాష నేర్చుకోవాలని నేను చేసిన ప్రయత్నం అక్షరక్రమంతోనే ఆగిపోయింది. తెలుగువారు అమాయకులు, మధుర స్వభావులు, త్యాగనిరతులు. మనం మధుర స్వభావులమే పరభాషలను నెత్తిన పెట్టుకోవడములో , మనం త్యాగ నిరతులమే .. తలన పెట్టుకుని గర్వంగా నేను తెలుగు వాడిని , నాది తెలుగు భాష అని చెప్పుకోవడానికి వెనుకాడటములో…!

నా తెలుగు
తేనేకన్నా తీయని అమృత భాష నాది
ఆంధ్రులకు  ఉత్తేజాన్నిచ్చే ప్రకృతి పర ప్రాచీన తెలుగుభాష నాది
తెలుగు పదం పలికితే
ఆధరం…మధురం
తెలుగు పాట పాడితే
వదన వికసితం!
తెలుగు అక్షరాలెప్పుడు
వెలుగుల్ని వెదజల్లు!
తెలుగు భాష నిత్యం
అవనిలో విరాజిల్లు!!
చేయెత్తి జై కొట్టు తెలుగు
గతమెంత ఘనకీర్తి గల
తెలుగు నాది..
నా శ్వాస-నా అణువణువు తెలుగే!!
చిమ్మచీకటి పారద్రోలే
వెలుగు నా తెలుగు
కవుల అక్షర పాత్ర
నా తెలుగు…
నా నేల… నా నిశ్వాస తెలుగు!!
కాబట్టి!!!
మనమంతా మమేకమై
మన తెలుగు తరిగిపోకుండా…
వెలుగు ఆరిపోకుండా
ప్రదీప్తం చేద్దాం
తెలుగును బ్రతికిమ్చడానికి….
అవసరమైతే..
చావనైనా చద్దాం
తెలుగు అక్షరాలు
ఆయుధాలుగా
తెలుగు వెలుగుల దివిటీ
వెలిగిద్దాం
తెలుగు వికాశానికీ శ్రమిద్దాం!
తేనె సోన మన తెలుగు అని నిరూపిద్దాం..!!

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *